About chandanamsreekanth

poet, journalist

అంతా కొత్తగా..

ఎంత కాలం నిరీక్షణ?
అయినా… చూస్తానో లేదోనని ఒకటే దిగులు
ఉన్నట్టుండి ఊహించని అద్భుతం పరుగెత్తుకొచ్చింది
ఆమె రాక నా ప్రపంచగతినే మార్చేసింది

అవును.. అమావాస్యే..
అయినా.. సముద్రం ఉరకలు వేస్తోంది
చిమ్మచీకట్లోనూ స్పష్టంగా మెరుస్తూనే ఉంది
పున్నమిని మించి అలలు తీరాన్ని ముంచెత్తుతున్నాయి.

నిజ్జంగా.. ఇది నిన్నటిదాకా మహా ఎడారే..
ఇప్పుడిక్కడ నీటి చెలిమెలు కనిపిస్తున్నాయి
అక్కడక్కడా జలపాతాల హోరు వినిపిస్తోంది
ఎండమావులు మాత్రం కావు

ఎముకలు కొరికే మంచుకొండల్లోనే ఉన్నాను
ఆచ్ఛాదనమేమీ లేకుండానే..
అయినా.. నా దేహం చాలా వెచ్చగా ఉంది
నిజమే.. నేను వాస్తవంలోనే ఉన్నాను

భూమికి అనేక మైళ్ల ఎత్తులో సంచరిస్తున్నాను
రెక్కలు లేకుండానే.. దాదాపు అంతరిక్షంలో..
ఇక్కడ నాకేమీ ఆక్సీజన్‌ అక్కర్లేదు
అయినా నా శ్వాస మరింత ఆహ్లాదాన్నిస్తోంది

చిక్కని అడవులు దహించుకుపోతూనే ఉన్నాయి
ఆర్పేందుకు ఫైరింజన్లో కనీసం కన్నీటి చుక్క అయినా లేదు
నడిమధ్యలో నిలుచున్నా… నిప్పురవ్వ తాకితే ఒట్టు
ఆత్మీయ మల్లెల వాసన నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

లక్షల వాహనాల రద్దీ రణగొణమంటున్నది
రహదారికడ్డంగా చక్కర్లు కొడుతున్నాను
నా చెవికి హాయిగొలిపే సంగీతమే వినిపిస్తోంది
ఏ ఒక్కటీ నన్ను తాకకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది

పచ్చడి మెతుకులు కలుపుతున్నాను
నా నోట్లోకి పంచభక్ష్య పరమాన్నాలే వెళుతున్నాయి
విందు భోజనమేదీ కనుచూపు మేరలో లేదు
అద్భుతమెలా జరుగుతున్నదో అంతు చిక్కడం లేదు

ఎప్పుడూ ఎవరెవరితోనో మాట్లాడుతూనే ఉన్నాను
కానీ ఆమె ఊసులు మాత్రమే నా చెవుల్లోకి వస్తున్నాయి
వెచ్చని ఆ స్పర్శ.. నిరంతరం ఉచ్ఛ్వాసనిశ్వాసల గాఢానుబంధం
మనసు పదేపదే ఆమెనే అద్దంలో చూసుకుంటోంది

ఇప్పుడు నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను
ఆమె ప్రతిబింబాన్ని బంధించిన కళ్లకు విశ్రాంతి తక్కువయింది
హృదయం నిండా తెలియని గర్వం..
ప్రతి అణువులో ఆమే కదలాడుతున్న అనుభూతి..

– చందనం శ్రీకాంత్‌
(ఆంధ్రజ్యోతి- నవ్య వీక్లీ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితం)

బహుపరాక్‌..


వేదిక దొరికితె చాలు ఉద్రేకపరిచే నాల్కలు
తెరచాటున కప్పదాటు తందనాలు
పచ్చని భూముల్లో
బ్రహ్మజెముడు పొదలు విస్తరిస్తున్న భయం

ఊరూవాడా గుండెలు చీల్చుకుంటున్న పోరాటం
సత్తువలేని చోటా బలమైన పిడికిళ్లతో మద్దతు
హోరెత్తుతున్న నినాదాల్లో
కావాలనే జీరబోతున్న గొంతులు

హద్దులు చెరిపి పల్లెలన్నీ పట్టాలెక్కిన ఆరాటం
కులమతాలన్నీ కలగలసిన పంక్తిభోజనం
ఉధృతమవుతున్న ప్రతిసారీ
ఇచ్చగొట్టే ప్రయత్నాల కమురువాసన

మబ్బుగమ్మిన ప్రతిసారీ చెర్నకోలలవుతున్న బలిదానాలు
చితిమంటలపై వీరోచిత ప్రమాణాలు
ఆదుకుంటామంటూనే
పేలాల్లో పైసలేరుకుంటున్న చప్పుడు

రోజుకో సంఘం, పూటకో శిబిరం
ఎజెండా ఒకటేనంటూనే జెండాల కిరికిరి
మనలోనే పరాయితనం
శత్రువు పన్నాగానికి తలలూపుతున్న బాంచెతనం

రెండ్రెండు నీతులు, రెండ్రెండు సిద్ధాంతాల
వంతపాడే ఆత్మహత్యాసదృశాలు
ఆలింగనం చేసుకుంటూనే
బలిదీసుకునే కుట్రబాజీ అవతారాలు

అంతరాలు తెగిపోతున్న సంబరం
పాలన మనదేనన్న ఆశాభావం
పురుడు పోయకముందే
చూలాలికి పాడెకడుతున్న ఆనవాళ్లు

పగవాడి నోరుమూయాల్సిన చేతులు
దాసోహమై ద్రోహం చేస్తున్న నీడలు
ఇది.. కాళ్లుగుంజే కప్పల కాలం జెల్లించాల్సిన సమయం
నిప్పుకణికలై కుట్రల ఖతం చేయాల్సిన సందర్భం

-చందనం శ్రీకాంత్‌
(ఆంధ్రజ్యోతి వివిధలో 10 అక్టోబర్‌ 2011న ప్రచురితం)

మా ఊరి బతుకమ్మ..

ఎములాడ బతుకమ్మ ఉయ్యాలో        ఎంత సక్కాగుంది ఉయ్యాలో
ఆడబిడ్డలు జూడు ఉయ్యాలో               మా ఊరి కోడళ్లు ఉయ్యాలో
గునుకపువ్వులతోటి ఉయ్యాలో          తంగేడుపూలతో ఉయ్యాలో
పట్టుకుచ్చులు తెచ్చి ఉయ్యాలో          రంగుపూలను దెచ్చి ఉయ్యాలో
బతుకమ్మ పేర్చిరీ ఉయ్యాలో              గౌరమ్మనూ పెట్టి ఉయ్యాలో
తీరుతీర్లా చీరలుయ్యాలో                    తీరొక్క నగలతో ఉయ్యాలో
సంబరాపడుకుంట ఉయ్యాలో             బాధలూ జెప్పుకుంట ఉయ్యాలో
సప్పట్లు కోలలూ ఉయ్యాలో                పాటల్వాడుకుంట ఉయ్యాలో
ముచ్చట్లు జెప్పుకుంట ఉయ్యాలో       ముందుకూ నడిశిరీ ఉయ్యాలో
సందుసందూ కలిసి ఉయ్యాలో           ఊరంత కదిలింది ఉయ్యాలో
అడుగుఅడుగు కలిసి ఉయ్యాలో         లక్షలా పాదాలు ఉయ్యాలో
మూలవాగూకోయి ఉయ్యాలో           బతుకమ్మ తెప్పలో ఉయ్యాలో
పోయి రా బతుకమ్మ ఉయ్యాలో        మల్ల యాడాద్దాకా ఉయ్యాలో
సల్లంగ ఉండుమని ఉయ్యాలో           సక్కంగ ఉంచుమని ఉయ్యాలో
సాగనంపీరమ్మ ఉయ్యాలో                సత్తిపిండీ బుక్కి ఉయ్యాలో
మూలవాగు నుంచి ఉయ్యాలో          అడుగులూ కదిలినై ఉయ్యాలో
అమ్మవారీ గుడికి ఉయ్యాలో             హారతీ కోసమని ఉయ్యాలో
అమ్మలక్కలు జూడు ఉయ్యాలో        అక్కజెల్లెలు గూడ ఉయ్యాలో
అత్తకోడళ్లమ్మ ఉయ్యాలో                  యారాండ్లు మరదండ్లు ఉయ్యాలో
మా ఇంటి బిడ్డలూ ఉయ్యాలో            వాళ్ల పిల్లలు గూడ ఉయ్యాలో
దబాదబా వోయిండ్రు ఉయ్యాలో        కోలాటమాడిండ్రు ఉయ్యాలో
కోలాటమాడిండ్రు ఉయ్యాలో              రాజన్న సన్నిధిల ఉయ్యాలో
వాయినాలూ పంచి ఉయ్యాలో           ప్రసాదమందుకుని ఉయ్యాలో
అమ్మ వారికి మొక్కి ఉయ్యాలో         మల్లవస్తామనీ ఉయ్యాలో
ఇండ్లకూ కదిలిండ్రు ఉయ్యాలో           ఆనంద పడుకుంట ఉయ్యాలో
ఎప్పుడిట్లాగుంటె ఉయ్యాలో                అందరూ గూడుంటె ఉయ్యాలో
మొక్కువెడుతా తల్లి ఉయ్యాలో         బోనమూ తీస్తాము ఉయ్యాలో
బద్ది పోశవ్వ తల్లి ఉయ్యాలో               బతుకు బాగుంచమ్మ ఉయ్యాలో
పార్వతమ్మా నీకు ఉయ్యాలో             పదివేల దండాలు ఉయ్యాలో..
వాగులో గంగమ్మ ఉయ్యాలో             మల్ల ఏడాదన్న ఉయ్యాలో
నిండుగా నీళ్లతో ఉయ్యాలో                 కళకళాలాడాలి ఉయ్యాలో
కరువుదీరే దాక ఉయ్యాలో                వాన కురిపించమ్మ ఉయ్యాలో

(కరీంనగర్‌ జిల్లా వేములవాడలో 3 అక్టోబర్‌ 2011 సోమవారం సద్దుల బతుకమ్మ ముగిసిన సందర్భంగా..)  

-చందనం శ్రీకాంత్‌

జై తెలంగాణంటే జయశంకరే..

ఒక బాధ..
ఒక దుఃఖం..
ఒక ఆవేదన..
ఒక సంతోషం..
ఏదీ జీర్ణం కాని పరిస్థితి..

నడుస్తున్న చరిత్ర
మాయమయిందని తెలిసి
పదేపదే దుఃఖిస్తున్నా..
పోరుబాట దిక్సూచీ
ఆగిపోయిందని తెలిసి
వెక్కివెక్కి ఏడుస్తున్నా..

సత్యమేందో చెప్పి
మోసమేందో విడమరిచి
ఉద్యమ చైతన్యం రగిల్చి
ముందుకురికించిన ముల్లుగుర్ర
ఇక పొడవదని తెలిసి బాధతో
మౌనం వహిస్తున్నా..

వేదాంతం, రాద్ధాంతం,
పిచ్చిమాటల నేతలను
నీతిలేని నాయకులను
నిజమేందో తెలుసుకొమ్మని
నిజాయితీగా పోరు చెయ్‌మని
నిత్యం సూచించిన
మీ గొంతు ఇక పలకదని తెలిసి
ఆవేదన చెందుతున్నా..

తెలంగాణ వీరులూ..
సమైక్యాంధ్ర వాదులూ..
శత్రువులు, మిత్రులూ
మనిషంటే మీరేనని
పదేపదే చెబుతుంటే
గర్వం తొణికిసలాడి
మీసం మెలేస్తున్నా..

మాటలు, సిద్ధాంతాలే కాదు
ఆచరించి చూపినట్టి
మానవతావాది మాత్రం
మీరంటే మీరేనని
బద్ధ వ్యతిరేకి గూడ
బల్లగుద్ది చెబుతుంటే
సంతోషం.. సంబరం..
పట్టరాని ఆనందం

ఆ గాంధీ, అంబేద్కర్‌..
వాళ్లనైతె చూడలేదు
ఆ ఇద్దరు కలగలిస్తే
కనిపించేదెవరంటే
ఖచ్చితంగా మీరే..

జై తెలంగాణంటే
ప్రతినోటా, ప్రతిచోటా
కంచుకంఠమై వినిపించేదిక
జయశంకరే..

-చందనం శ్రీకాంత్‌

రెండు తెలుగులు.. ఒకటేనా?

ఇది మా గురువుగారు, పదవీ విరమణ పొందిన తెలుగు అధ్యాపకులు, ప్రముఖ కవి చొప్పకట్ల చంద్రమౌళి గారు తన అనుభవంలోంచి రాసిన వ్యాసం. అన్ని ప్రాంతాల వారూ తప్పక చదవాల్సిన అంశం. ప్రత్యేకించి తెలంగాణలో ఉన్న వారందరూ చదివి, సీమాంధ్రులతోనూ చదివింప జేయాల్సిన విషయం. నిడివి కాస్త పెద్దదైనా ఓపికతో చదువుతారని ఆశిస్తున్నా…

– చందనం శ్రీకాంత్‌


సమన్వయమెక్కడిది.. సామరస్యమెక్కడిది?

‘బాగాలున్నాయా?’… తిరుపతిలో ఒక కిరాణా కొట్టులో అడిగాను. 1960లో మా మామగారితో తిరుపతి వెళ్లిన. ఆయనకు జర్దా పాన్‌ అలవాటు. కలీతా వెంటే ఉంటుంది.  జర్దా, బాగాలు లేకుంటే ఓ షాపులో అడిగాం. అతను లేవన్నాడు. మరో షాపులో అడిగినం. అతను.. ‘బాగాలా..? అంటే ఏమిటి? ఎలా ఉంటాయి? అన్నాడు.
‘ఛాలియాలంటారు చూడు’.. అన్నాను. ‘ఏమో.. అలాంటియేమీ లేవండి’.. అన్నాడు విసుగ్గా. మేం అలాగే నాలుగైదు షాపుల్లో అడుగుతూ వెళ్లాం.. అన్నింటిలో లేవంటే లేవన్నారు. చివరకు ఒక షాపులో ఒకే అతనున్నాడు. గిరాకీ లేనట్టుంది. అతడిని అడిగా ‘బాగాలంటే ఏం చేస్తారండీ’ అన్నాడు. ‘తమలపాకుల్లో వేసుకుంటారు చూడూ’.. అన్నాను. ‘ఓహో అవా..! ఇక్కడ బాగాలంటే ఎవరికీ తెలియదండి. వాటిని పచ్చొక్కలనాలి’.. అని మళ్లీ.. ‘మీకు రేకొక్కలు కావాలా ముక్కొక్కలు కావాలా? ‘ అని అడిగాడు. ‘అవేంటో మాకు తెలియదు.  రెండూ చూపించమన్నాను. చూపించాడు. ఉల్లిపాయ పొరల్లా కత్తిరించినవి రేకొక్కలనీ, మామూలుగా కత్తిరించి వాడేవి ముక్కొక్కలనీ అన్నాడు. అయితే ఆ రెండు రకాలూ కాకుండా పోకను రెండు ముక్కలు చేసిన వక్కలు కావాలని తీసుకున్నాం. అయితే మా మామగారికి పాన్‌లో అజ్గరెల్ల జర్దా, పూదీనా కూడా కావాలి. పూదీనా అయిపోయింది.  దాని కోసం కూడా కావాలని అడగాలనుకున్నాడు. సరేనని ‘ఇంతలో ఒక పాన్‌ వేసుకోండి తర్వాత పూదీనా కొందాం’ అన్నాను.

ఒక షాప్‌ దగ్గరికెళ్లి ‘ఒక ఆకు కట్టండి’.. అన్నాను. ‘ఆకు కట్టడమంటే ఏమిటండీ? కిళ్లీ కావాలా?’.. అని అడిగాడు.  ఔనన్నాను. ఎలా కట్టాలన్నాడు. ‘అజ్గరెల్లి జర్దా ఉందా’ అడిగాను. అదేంటో మా దగ్గర లేదండి’ అన్నాడు. ‘పోనీ.. పూదీనా ఉందా?’ అడిగాను. అదీ లేదన్నాడు. ‘అయితే మాకు వద్దండి’ అని ఇద్దరం వెనుదిరిగాం. కొన్ని అడుగులు వేసే సరికి మాకు వెనక నుండి షాపతని మాటలు వినిపించాయి. ‘నైజాం గొడ్డులున్నట్టున్నార్రా’.. అంటూ పక్కవాడితో అంటున్నాడు. కొత్త ప్రదేశం.. వీడితో గొడవెందుకని ముందుకు నడిచాం. గోవిందరాజస్వామి గుడి తర్వాత కుడికి ఉండే పెద్ద రోడ్‌ వెంబడి గల కిరాణాషాపుల్లో ‘పూదీనా ఉందా? ‘ అని అడుగుతూ వెళ్లాం. కొందరు లేదన్నారు. కొందరు తెలియదన్నారు. అయితే ఒకతను ఓపికతో ‘పూదీనా అంటే ఏంటండి.. ఏం చేస్తారు?’ అని అడిగాడు. ‘అదే.. ఆకులల్లో వేసుకుంటారు చూడండి.. అదే’ అన్నాను.  ‘ఓహో..అదా..’ అని కొంచెం షాపు బయటకు వచ్చి మాకు చూపిస్తూ ‘అటు చూడండి.. లెఫ్ట్‌సైడ్‌లో ఓ కమాన్‌ ఉంది చూడండి. అందులో లోపలికి వెళ్లి అడగండి ఇస్తారు’ అన్నాడు. ఉత్సాహంతో ఊపుకుంటూ ఊపుకుంటూ మేం వెళ్లి కమాన్‌లోకి ప్రవేశించి చూసేవరకు, అక్కడంతా కూరగాయల మార్కెట్‌ ఉంది. పక్కలకు కొన్ని షాపులు కూడా ఉన్నాయి. అక్కడ పూదీనా కోసం అడిగే సరికి కూరజాతి ఆకుకూర పూదీనా చూపించారు. నిరాశతో వెనుదిరిగి మళ్లీ ఓ కిరాణాషాపులో అడిగాం. ‘దాన్ని ఏం చేస్తారండీ’.. అని అడిగితే కిళ్లీలలో వాడతారన్నాను. ‘ఓహో! అదాండీ.. ఇక్కడ పూదీనా అంటే మీకెవరూ ఇవ్వరండీ’ అన్నాడు. ‘మరేమనాలి’ అని అడిగాను. ‘మెంథాల్‌ అంటేనే దొరుకుతుందండీ’ అన్నాడు. మళ్లీ మెంథాల్‌, మెంథాల్‌ అనుకుంటూ, అడుగుతూ వెళ్లాం. అందరూ లేదన్నారు. ఒక్క షాపులో మాత్రం ‘ఉందండీ ఇస్తాను. మీకు ఎంత కావాలండీ’ అని అడిగాడు. ‘ఒక తులం లేక అద్దతులం ఇవ్వండి’ అన్నాడు మా మామ. ‘అయ్యో! అంత తక్కువ ఏం చేసుకుంటారండీ’.. అంటూనే చిన్న త్రాసు తీసుకుని, కుడిచేతిలో ఒక చెక్క అరలో నుండి మెంతులు తీసిపోశాడు. నేను తలకొట్టుకుని ‘మెంథాల్‌ అంటే మెంతులు కావయ్యా! దాన్ని కిళ్లీలో వాడతారు’ అన్నాను. ‘ఏమో అదేమిటో మాకు తెలియదండీ’ అన్నాడు. మళ్లీ బయటకు వచ్చి షాపుల వెంబడి పడ్డాం. పూదీనా లేందే మా మామకు పాన్‌ నడువదు. పాన్‌ లేందే ఆయనకు రోజు గడవదు. చివరికి ఒక షాపులో అడిగే సరికి అతను ఓపికతో విని ‘అది నాకు తెలుసండీ. దాన్నిక్కడ పూదీనా అని అడిగినా, మెంథాల్‌ అని అడిగినా దొరకదండీ’ అన్నాడు. మరేమనాలి అని అడిగాను.
‘దాన్ని పిప్పరమెంటు పువ్వు అని అడిగితే ఇస్తారండీ’ అన్నాడు. సరేనని ‘పిప్పరమెంటు పువ్వుందా’ అని కొన్ని షాపుల్లో అడిగే సరికి ఒక షాపులో ఉందని చెప్పి ఒక తులం జోకి ఇచ్చాడు. ఈ పూదీనా వేట కోసం మాకు రెండు గంటల సమయం పట్టింది.

రెండు తెలుగులు ఒకటి కాదు..

రెండు సామాజిక వర్గాల మధ్య భాషా సమన్వయం, భావ సామరస్యం లేకుంటే ఎదురయ్యే పరిస్థితులను వివరించడానికి శాంపిల్‌గా ఈ సంఘటనను వివరించాను. ఇలాంటి వాటికి ఇదో మచ్చుతునక. మన రాష్ట్రం నెహ్రూ, ఫజులలీ అనుకున్న తీరులో ఉన్న భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు. రెండు భాషలకు ‘తెలుగు’ అని ఒకటే పేరున్నా ఈ రెండు తెలుగులు ఒకటి కాదు. ఆంధ్రా వ్యావహారిక భాషలోని క్రియలు వేరు. నామవాచకాలు వేరు. ఒక భాషా వాక్యానికి ఇవే ప్రధానమైనవి. ఆంధ్రా పల్లెటూరి  వ్యక్తి, తెలంగాణ పల్లెటూరి వ్యక్తి ఇద్దరూ సహజ ధోరణిలో వేగంగా మాట్లాడుకుంటే ఒకరి భాష మరొకరికి అర్థం కాదు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రతి మనిషీ నిత్యజీవితంలో ఉదయం నుంచీ సాయంత్రం, రాత్రి టీవీ చూస్తూ నిద్రపోయే వరకు అన్ని రంగాల్లో చోటు దక్కించుకుని రాజ్యమేలుతున్నది ఆంధ్రా వ్యావహారిక భాష. నవలల్లో, నాటకాల్లో కథల్లో, పత్రికల్లో, వాసాల్లో, కవితల్లో, సినిమాలు, రేడియోలు, టెక్స్ట్‌ పుస్తకాలు, తరగతి బోధనలు… ఇలా ఒకటేమిటి? చివరికి అసెంబ్లీలోనూ తెలంగాణ ప్రజల నెత్తినెక్కి ఆధిపత్యం చేస్తున్నది సీమాంధ్రుల వాడుక భాష. తెలంగాణలో 1956 సమయానికి భాషాభివృద్ధి కూడా చక్కగా జరగలేదు. అదే ఆంధ్రప్రాంతంలో గిడుగు రామ్మూర్తి వ్యావహారిక భాషోద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆ భాషనలో రచనలు కూడా అక్కడే విజంభించాయి. గురజాడ కన్యాశుల్కం, గేయాలూ, కవితలు, కథలు, రావిశాస్త్రి రచనలు, విశాఖ మాండలీకాలు, శ్రీశ్రీ, ఆరుద్ర, చలం నవలలు, రచనలు, శరత్‌ రచనల అనువాదాలు అన్నీ ఆంధ్రా వ్యావహారిక భాషలోనే కొనసాగాయి. ఈ భాషనూ, రచనలనూ తెలంగాణ వాల్లు నిన్నమొన్నటి దాకా, నేటికీ… ఈ 60 ఏళ్లుగా మోస్తూనే ఉన్నారు. తెలంగాణ భాషలోనే కవిత్వం, కథలూ చాలా తక్కువగా వస్తున్నాయి. వాటిని సరిగ్గా తొందరగా చదివి అర్థం చేసుకోలేక నిరాదరణకు లోనవుతున్నాయి. పాటలు మాత్రం జనం గుండెల్లోకి దూసుకుపోతున్నాయి.

వారు ఏది రాస్తే.. అదే రచన

నైజాం పాలనలో ఊళ్లల్లో బడులే లేవు. ఎక్కడో పెద్ద ఊళ్లల్లో బడి ఉంటే బోధనంతా ఉర్దూ భాషలోనే. తెలుగు నామమాత్రానికే ఉండేది. అదీ అంతా గ్రాంధిక భాషలోని ఏవో వాచకాలుండేవి. ఇంగ్లీషుకు కూడా అంతగా ఆదరణ లేదు. చదువుకునే వారి శాతమే చాలా తక్కువగా ఉండేది. 1949-50లలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చిన రోజులలో చదువులపై చైతన్యం కలిగింది. క్రమంగా చదువుకునే వారి సంఖ్య పెరిగింది. అయితే ఒక్కొక్క విద్యార్థి ఏడో తరగతిలో ఉండగానే గడ్డాలూ మీసాలూ వచ్చి దాదాపు 18 సంవత్సరాల వయసు దాకా వచ్చేవారు. పెండ్లి చేసుకుని ఎనిమిదో తరగతిలోనే పిల్లల్ని కనేవారు.
ఇక సీమాంధ్రులు.. 200 సంవత్సరాల నుంచీ ఇంగ్లీషులో ప్రవీణులయ్యారు. తెలుగులో వారు మాట్లాడుకున్నట్టు రాసినా అది రచన అయ్యే పరిస్థితి. ఇలాంటి వాళ్లతో మేం ఎలా పోటీ పడగలం. భాష ఒకటి కాకున్నా మరి ఈ రెండు ప్రాంతాలను ఎందుకు కలిపారు? ఆర్థిక, సామాజిక, రాజకీయ విద్యావిజ్ఞాన రంగాలన్నింటిలో వెనుకబడ్డవారు తెలంగాణ ప్రజలు. ఫజులలీకీ, నెహ్రూకూ తెలుగు భాష గురించి, ఈ లోతులన్నీ తెలియవు కదా?

మొదటి నుండీ తెలంగాణ భాష చిన్నచూపుకూ, నిర్లక్ష్యానికీ, అవహేళనకూ, వివక్షకూ గురవుతూనే ఉన్నది. ఈ బాధలు చిన్నవాండ్ల దగ్గరి నుండీ పేరు మోసిన వాండ్లు కూడా అనుభవిస్తూ వస్తున్నారు. సంక్షిప్తంగా కొన్ని ఉదాహరణలు మీ ముందుంచుతున్నాను.

వరవరరావు కవితపై అవమానకర సమీక్ష

1975లోనో, 1976లోనో అనుకుంటా.. వరవరరావు ఒక కవితా సంకలనం చేసి ఆంధ్రజ్యోతి వారపత్రికకు సమీక్ష కోసం కాపీలు పంపించాడు. అందులో ఒక వర్ణన ఇలా ఉంది. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. ‘తెప్పకు చిల్లులు పడి బొట్లుబొట్లుగా వర్షంలా కిందికి కురుస్తున్నది’ అని. అప్పుడు ఆంధ్రజ్యోతిలో సమీక్షలు చూస్తున్నది ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. అతను కవితలను సమీక్షిస్తూ ‘తెప్పకు చిల్లులు పడితే నీళ్లు తెప్పలోకి రావాలి కానీ, కిందికి కురియడమేమిటి? ఈ మాత్రం అవగాహన లేదా? అనే ధోరణిలో రాశాడు. అయితే, వరవరరావు దానికి జవాబిస్తూ.. ‘తెలంగాణలో ఆకాశంలోని నీటి మబ్బులను(మేఘాలను) తెప్పలంటారు’. అని వివరణ ఇస్తే.. ‘ఓహో! మేం తెలంగాణ భాషను నేర్చుకుని, అర్థం చేసుకుని ఈ కవితలు చదవాలా? ‘ అని అవహేళనగా రాశాడు. అయితే, అందులోని కవితలన్నీ అక్కడక్కడా కొన్ని పదాలు తప్ప సీమాంధ్ర వ్యావహారిక భాషను మొదటి నుండీ  చదువుకుని, అలా రాయడం అభ్యాసం చేసి ఆ భాషలో రాసినవేనన్న విషయం మరిచి ఇలా అవహేళన చేయడం అక్కడి వాళ్లందరికీ నిత్యకృత్యాలే.

తెలంగాణలో నాటక కళే లేదట…

1974 ప్రారంభంలో మైసూర్‌లోని ప్రీమియర్‌ స్టూడియోలో బహుశా ‘యశోదకృష్ణ’ అనుకుంటా. ఆ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. జమున, మిక్కిలినేని మొదలైన కళాకారులు వచ్చారంటే అభిమానంతో చూద్దామని వెళ్లాం. జమున అలా కనిపించి మళ్లీ లోపలికి వెళ్లింది కానీ, మిక్కిలినేని మేకప్‌లో వేడికి బయట బొర్ర పుణుక్కుంటూ నిలుచున్నాడు. అతనప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో నటరత్నాలు అనే శీర్షిక నిర్వహిస్తున్నాడు. నేను వెళ్లి పరిచయం చేసుకుని ‘నటరత్నాలు శీర్షికలో తెలంగాణ నాటక కళాకారుల గురించి తర్వాత రాస్తారా’ అని అడిగాను. వెంటనే అతను ఉద్రేకంగా తీసివేసే ధోరణిలో ‘తెలంగాణలో నాటక కళ ఎక్కడున్నది? నటులెక్కడ ఉన్నారు? రాయడానికి అక్కడేముంది అంతా డ్రై.. । అన్నాడు. అప్పుడు నేను మళ్లీ మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల వెనుదిరిగాను. అతను రాయకున్నా ఫరవాలేదు. కానీ, కనుక్కోకుండా ఆలోచించకుండా తీసివేయడం నాకు చాలా బాధ కలిగించింది. వేములవాడ, ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, దోమకొండ, నిజామాబాద్‌లలో నాటకసంస్థలు విజయవంతంగా ప్రదర్శనలిచ్చాయి. బెజ్జంకిలో సురభి నాటక సంస్థ చాలా కాలం ప్రేక్షాకదరణతో పనిచేసింది.

అవగాహన లేక ఉద్యోగమివ్వని వైనం

1971, 72లో నేను తెలుగు అకాడమీలో ఉద్యోగం కోసం వెళ్లాను. బూదరాజు రాధాకృష్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. నేను అతని ఛాంబర్‌లోకి వెళ్లి ..’నేను తెలుగు ఎంఏ పూర్తి చేశాను. మీ అకాడమీలో ఉద్యోగం కోసం వచ్చాను’ అని అడిగాను. ‘మీదేవూరు?’ అడిగాడు. ‘వేములవాడ’ అని చెప్పాను. ఆయన ఒక్కసారే తీవ్ర స్వరంతో ‘ఇదివరకే మొత్తం ఆంధ్రులతో అకాడమీని నింపివేశారనే విమర్శలున్నాయి. నీకు ఉద్యోగం సాధ్యం కాదు’ అన్నారు. నేను చిరునవ్వుతో జవాబిస్తూ ‘నేను ఆంధ్రుణ్ణి కాదండీ’ అన్నాను. అతను వెంటనే ‘ఈస్ట్‌ గోదావరి డిస్ట్రిక్టు కాదా’ అన్నారు. ‘కాదండీ.. మాది కరీంనగర్‌ డిస్ట్రిక్టు అన్నాను. దానికి అతను గిల్టీగా ఫీలవుతూ ‘అయినా సరే.. ఇప్పుడు ఉద్యోగాలేం లేవు. తర్వాత కలవండి’ అని వెళ్లగొట్టాడు. అప్పటి పరిస్థితి అలా ఉంది.

ఆస్పత్రిలోనూ అవమానమే..

1964లో నేను బేగంపేట ప్రకృతి చికిత్సాలయంలో ఉన్నాను. దానికి సూపరింటెండెంట్‌ భీమవరం వారు బి.వెంకట్రావుగారు. ఒక రోజు ఉదయం నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగాడు. దానికి నేను ‘నిన్న నాలుగైదుసార్లు కడుపు కొట్టింది’ అన్నాను. ‘కడుపేమిటి? కొట్టడమేమిటయ్యా ?’.. ప్రశ్నించాడు.  విరేచనాలవుతున్నట్టు వివరించగానే ‘వెధవ తెలంగాణ భాషతో వేగలేక ఛస్తున్నాం’ అని విసుక్కుంటూ చీదరించుకున్నాడు.

మందలింపు అంటే తెలియక అవహేళన

హన్మకొండలో సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్‌ రామలక్ష్మణమూర్తి (ఎండీ) గారికి ఆర్‌ఈసీలో జరిగిన ఘన సన్మాన  సందర్భంలో నా కవితను ఒక రేడియో అనౌన్సర్‌ చదివాడు. ‘శాంతంగాప్రేమతో రోగులను పలకరిస్తాడని చెబుతూ, సంతోషంతో ‘మందలిస్తాడని’ రాశాడు వేల జనం ఉన్నారు. ‘మందలించే గుణమే కాదు వారిది.. కవి గారు ఇలా ఎందుకు రాశారో ఏమో’ అని వ్యాఖ్యానించారు. అయితే మందలించడం అనే మాటకు యోగక్షేమాలు కనుక్కోవడమనీ, రోగుల బాగోగులు తెలుసుకోవడం, చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చిన వారిని పలకరించడం అనే సందర్భాలలో కూడా వాడుతారని వివరించిన  తర్వాత ‘అలాగా..! నాకు తెలియదండీ’ అన్నాడు.

‘తెలంగాణ వారికి తెలుగు కూడా చక్కగా రాదు. తాము మాట్లాడేదే కరెక్ట్‌’ అని తప్పులు మాట్లాడుతూ ఇక్కడ కరెక్ట్‌గా మాట్లాడే వారే తప్పులు చేస్తున్నారనే డామినేటింగ్‌ మనస్తత్వానికి ఒకటీ రెండు ఉదాహరణలిస్తాను.

శాపం.. సాపం.. పాపం

విశాఖపట్నం నుండొచ్చిన ఓ మహిళ.. పేరు సావిత్రి.. ఆమె 1968లో బీఈడీ కాలేజీ వెలిడిక్టరీ ఫంక్షన్‌లో నేను రాసి చెబుతున్న ఒక చిన్న బుర్రకథలో ఒక చోట ‘కుబేరుడెపుడో ఒక యక్షునికి శాపమిచ్చినట్టు’ అని వస్తుంది. నేను చెప్పగానే ఆమె అనడం మాని ‘మేష్టారు మీరు తప్పు చేస్తున్నారు’ అన్నది. ‘ఏమిటమ్మా.. నా వలన ఏం తప్పు జరిగింది’ అని అడిగాను. మీరు ‘శాపము’ అంటున్నారు అంది. ఏం అనగూడదా? మరేమనాలి అని అడిగాను. ‘సాపము’ అనాలి అంది. ‘నా పాపం’ అంటూ నెత్తికొట్టుకోవాల్సి వచ్చింది. మా తెలుగు లెక్చరర్‌ శేషయ్యగారు వచ్చి చెప్పేదాకా తన ఉచ్ఛారణే సరైంది అని వాదించింది. అంతే కాకుండా ఆ లెక్చరర్‌ను కూడా ‘సాషయ్య గారు’ అని పిలిచింది.
వార్తలు చదివే కొందరు ‘సాసనసభ’, విసాకపట్నం’ అంటూ ఉచ్చరిస్తారు.  నటరాజ రామకృష్ణ శిష్యుడు పేరిణీ శ్రీనివాస్‌ నాతో ‘సంకరాభరణం’ ఉచ్చారణే కరెక్టని, నా ఉచ్చారణ ‘శంకరాభరణం’ తప్పని మొండివాదనకు దిగాడు.

ఇక.. వేగంగా ఆయా ప్రాంతాల కొలెక్యువల్‌ భాషలో మాట్లాడితే ఒక ప్రాంతం వారికి రెండో ప్రాంతం వారి భాష అసలే అర్థం కాదు. విశాఖపట్నం ద్వారకానగర్‌లో మా పెద్దవాడు ఓ పాన్‌టేలాలో తొందర ఉండి ‘బగైర్‌కత్తా బెంగాల్‌ ఆకు రాజరతన్‌ చీటా’ అని ఎన్నిసార్లు చెప్పినా అతనికి అర్థం కాలేదు. అదే రీతిలో ఈ ప్రాంతంలో ఏ జిల్లాలో మాట్లాడినా తప్పక అర్థం అవుతుంది.

భాష విషయంలో మరో అంశం కూడా ప్రధానమైనది. పల్లెటూళ్లలో, చిన్నచిన్న పట్టణ ప్రాంతాల్లో కూడాసరియైన వైద్య సదుపాయాలు లేక పెద్దపెద్ద దవాఖానాలు, పెద్ద డాక్టర్ల ఖర్చులు భరించలేక కొంతలో కొంత స్వాస్థ్య స్వావలంబనగా పూర్వకాలంలో వలే ఆయుర్వేద చికిత్సలతో, అందుబాటులోని ఓషదులతో చవకలో చికిత్స చేసుకుంటారు చాలా మంది. అయితే అలా చికిత్స చేసుకోవాలంటే మొదట ఓషధుల గుణధర్మాలు తెలియాలి. అవి తెలియాలంటే వస్తు గుణదీపిక(మెటీరియా మెడికా)లను చూడాలి. వస్తు ధర్మాలు సూచించే ఈ ఓషధీనిఘంటువులున్నా, తెలంగాణ వారికి ఆ గ్రంథాలలో చాలా ఓషధులు కనిపించవు. ఒక ఓషధీని ఈ ప్రాంతంలో ఒక పేరుతో పిలిస్తే, ఆ గ్రంథాల్లో మరో పేరుతో, ఆంధ్రప్రాంతం పేరుతో ఉంటుంది. ఎందుకంటే వాటన్నింటి రచయితలు ఆంధ్రులే. మచ్చుకు కొన్ని..
తెలంగాణ-ఆంధ్రా ప్రాంతాల పేర్లతో ఓషధులూ, ఆహారమూలికలూ, డొమ్మడోలు మొక్క పెన్నేరుగడ్డ పేరుతోనే దొరుకుతుంది. అలాగే గుటుగుటు చెట్టు- దుష్టవేదుగా, పొప్పడి- మదనాలు, బొప్పాయిగా, దూల్‌దుమ్మ- దూలగొండిగా, రేచుక- నేలగొర్మిడిగా, మైదాకు-గోరింటగా, అశ్వ-అవిసెగా, పుంటికూర-గోంగూరగా, నవ్వోతు-కలకండ, కలకండ, పటికబెల్లంగా, దాసన్న- మందారగా, కంద- చిలగడదుంపగా, పుల్లకంద- కందగా, రుద్రాక్ష -చంద్రకాంతగా, సరస్వతి-మండూకపర్ణిగా, సంత్రా-కమలాగా ఉంటుంది. ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే. దీంతో స్వయం వైద్య సదుపాయం కూడా చక్కగా అందకుండా పోయింది.

ఇక నిత్య జీవితంలోని అన్ని రంగాల్లోని పేర్లు, నామవాచకాలు, ఇతర భాషాభాగ శబ్దాలు ఎన్నో వేర్వేరుగా ఉంటాయి. రెండు ప్రాంతాల భాషలపేర్లు కూడా ‘తెలుగే’ అయినా రెండు తెలుగులు ఒక్కటి కాదు.

ఇక తెలంగాణ భాష ఏ రంగంలోనూ వాడుకలో లేదు. కాలక్రమాన, ఆయా కారణాల వలన వాడుక భాషగా స్థిరపడిన సీమాంధ్ర భాషనే మేము కూడా అనివార్యంగా, ప్రత్యామ్నాయంగా గత్యంతరం లేక వాడవలసి వస్తున్నది. ఇక్కడి చదువుకున్నవాళ్లూ, మీ భాషలో రాయడం అలవాటైన వాళ్లు మాత్రమే రాయగలరు. పల్లెటూరి వారు అర్థం చేసుకోగలిగినా ఈ భాషలో రాయలేరు, మాట్లాడలేరు. మేం సీమాంధ్ర వ్యావహారికంలో రాయగలిగినా ఇంట్లో, మిత్రులతో మళ్లీ తెలంగాణ యాసలోనే సంభాషణ నడుస్తుంది. అందుకే కొంత మంది ఆంధ్రామిత్రులు నా కవిత్వం చదివి, నాతో మాట్లాడిన తర్వాత ‘ఏమండీ చంద్రమౌళి గారూ… మీ కవిత్వం మాకు చక్కగా అర్థమవుతున్నది. చాలా అద్భుతంగా అనిపిస్తున్నది. కానీ మీరు మాట్లాడుతుంటే ఏమీ అర్థం కావడం లేదు’ అనే వారు.

నా సాహితీ మిత్రులు విమర్శించినా ఫరవాలేదు. కానీ నాకు తోచిన ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. ఇప్పుడు నిత్యజీవితంలో అలవాటూ, అభ్యాసం లేని రచయితలు పట్టుదలతో తెలంగాణ జానపదంలో రాయబోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నాకు తెలిసినంతలో తెలంగాణ భాషలో మొదట రచన చేసిన వారు సురమౌళి గారు. 1952 ప్రాంతంలో ఆంధ్రపత్రికలో ‘అంగుడుపొద్దు’, ‘మంకు’ అనే పేర్లతో కథలు రాశాడు. తర్వాత ఇక్కడి ప్రాంతీయ పత్రికల్లో చాలా రాశాడు. కానీ ఆ రచనలను స్పీడ్‌గా చదవడం, తొందరగా అర్థం చేసుకోవడం కష్టం. ఇటీవలి కాలంలో  చాలా మంది తెలంగాణ భాషలో కథలు రాశారు. ఇక సీరియస్‌ కవితలు రాయడం, రాసినా అవి ప్రాచుర్యంలోకి రావడం చెప్పలేం.. అనుమానాస్పదం. ఈ భాషలో పాట మాత్రం  అద్భుతంగా విజయం సాధించింది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. ఇదీ తెలంగాణ భాష ప్రోగెస్‌ రిపోర్ట్‌ సంక్షిప్తంగా.

తెలంగాణ ప్రజల భాషకెక్కడిది ప్రాధాన్యం?

మిత్రుడు ద్వా.నా. శాస్త్రి ఈనాడు దినపత్రికలో రాస్తూ ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల ఆయా మాతృభాషలకు ప్రాధాన్యం వచ్చింది. ప్రభుత్వం కూడా తెలుగును అధికార భాషగా, పరిపాలన భాషగా నిర్ణయిస్తూ చట్టం చేసింది. దాని అమలు కోసం అధికార భాషాసంఘం ఏర్పడింది’ అని రాశారు. మిగతా భాషల సంగతి నాకు తెలియదు కానీ, తెలంగాణ ప్రజల భాషకు మాత్రం ప్రాధాన్యం అసలే  రాలేదు. పైగా అవహేళన, అధిక్షేపణ, చిన్న చూపు, కించపరచడం మొదలుగువాటికి గురయింది. ఇక పరిపాలన భాషగా, అధికార భాషగా తెలంగాణ భాషకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పై ప్రయోజనాలన్నీ సీమాంధ్ర వ్యావహారికానికే దక్కాయి.

రాజకీయంగా, విద్యాపరంగా, భాషాపరంగా, సామాజికంగా, పాలనాపరంగా తెలివితేటల విషయం, లౌక్యం, వ్యవహారంలో చాలా వెనుకబడి సీమాంధ్రకు సమ ఉజ్జీ కాని తెలంగాణను సీమ్రాంధతో ఎందుకు కలిపారు? ఈ ప్రశ్నకు వచ్చే జవాబే వేర్పాటుకు దారి తీస్తున్నది.

మన కలయికకు భాషా ప్రయుక్త లక్షణాలు లేవని తెలిసీ కలిశాం. ఒకే పేరు గల రెండు రకాల భాషల అక్రమ సంబంధం పరిణామాల ఫలితంగా ఏర్పడ్డ ఉద్యమ విజృంభణే తెలంగాణ అంతా విస్తరించింది. ఇది ప్రజా ఉద్యమం. నేడు ఏ నాయకుడి చేతిలోనూ లేదు. ఓర్చుకోలేనంతటి అక్రమాలను చూసీచూసీ విసిగిపోయాం. ఇక విడిపోదాం. మరో ఆపరేషన్‌ క్యాటర్‌పిల్లర్‌ అవకాశం రాగూడదని ఆశిద్దాం.

– చొప్పకట్ల చంద్రమౌళి

వేములవాడ, కరీంనగర్‌ జిల్లా, ఫోన్‌ 9246827021

రణస్థలం..

దశాబ్దాల చరిత గల
ఉస్మానియా వర్సిటీ
రారమ్మని చదివేందుకు
కబురు పంపుతున్నది..

చాణక్యులనందించిన
చదువులమ్మ తన ఒడికి
ఉద్యమమై రావాలని
చెయులు చాచుతున్నది

డిగ్రీ చదివితే చాలదు..
మార్కులుంటె సరిపోదు..
పుస్తకాల పురుగులు
కులాసాల మనుషులు
పిడికిలెత్తగలిగితేనే
పరుగున రమ్మంటున్నది

భోజనంలో రాళ్లు, రప్పలు
మోయలేని మెస్‌ బిల్లులు
అటెండెన్సు గొడవలు
యూనియన్ల తగవులు
దిష్టిబొమ్మ దహనాలు
చేతనైతె ధర్నాలు
దడపుట్టే దరువులు
బతుకుదారి చూపేందుకు
బహుచక్కని నేస్తాలని..

పోలీసులు మీ దోస్తీ
బాష్పవాయుతో కుస్తీ
శాంతికపోతాల సుస్తీ
మీ కోపం రాజేస్తే..
రోడ్డంతా రాళ్లవాన,
కమిలేలా లాఠీమామ

నిత్య యుద్ధక్షేత్రంలో
బొంగురుపోయె గొంతులు
నొప్పెట్టే చేతులు
సర్కారు కుట్రలు
రాజకీయ రగడలు
పాఠం నేర్పేందుకివి
భలేభలే సందర్భాలు

చదువంటే ఇదేఇదే
నిత్యసమరనాదం
ఖాకీలతో, తూటాలతో
సదా సాన్నిహిత్యం

భయమేస్తోందా బిడ్డా
సల్లదాగి నిండపడుకో
కాళ్లురెక్కలు మంచిగుంటె
కూలిపనికి పోయి బతుకు

రక్తం ఉరకలు వేస్తే
ఉస్మానియాకు పరుగెత్తు
చరిత్ర తిరగేస్తూనే
కొత్త చరిత సృష్టించు
రాబోయే తరాలకు
నీవే ఒక పాఠమవ్వు

-చందనం శ్రీకాంత్‌
బొమ్మ: అక్బర్‌

ముప్పయ్యొకటీ..! నువ్వే లక్కీ

ఓ ముప్పయ్యొకటీ
అదృష్టమంటే నీదే
డీసెంట్‌గా డిసెంబర్‌లో వచ్చి
హంగామా చేసే నీవంటే
ఎందరికో వేలంవెర్రి
సరికొత్త వ్యాపారమంత్రాన్ని
ఆవిష్కరించే
సొగసైన దానివి మరి..

స్వీట్లు, కేక్‌లు, గిఫ్ట్‌లు
డీజేలతో హోరెత్తే పబ్‌లు
కిటకిటలాడే స్టార్‌నైట్‌ మైదానాలు
ఛీర్‌మంటూ సందడి చేసే
మగ్గులు, పెగ్గులూ
ఖాళీ అయ్యే కబాబ్‌లు
లిమిటెడ్‌ టు అన్‌లిమిటెడ్‌
ప్యాకేజీ ఏదైనా, ఎక్కడైనా
పేరుకే జనవరి ఫస్టు కోసం..
క్రెడిటంతా నీదే

జేబులు ఖాళీ అయినా
సంబరం అంబరమంటాలె
వాణిజ్యసూత్రం చక్కగా పనిచేయాలె
ఈ దశాబ్దంలో నీకిలా
వీడ్కోలు పలుకుతా
కానీ.. ఒక్క షరతు
గడియారం ముల్లు నిన్ను దాటాక
హ్యాంగోవర్‌తో
ఎవరూ తలపట్టుకోవద్దు
అలాగైతేనే..
నువ్‌ మళ్లొచ్చినపుడు
మరింత పండగ చేస్తా

-చందనం శ్రీకాంత్‌

ఇంకెక్కడిది గురూ బ్రైట్‌ ఫ్యూచర్‌?


ఇంకెక్కడిది గురూ బ్రైట్‌ ఫ్యూచర్‌?
ఓ పెగ్గేద్దాం.. తొందరగా ముగించుకొచ్చేయ్‌
అని సెల్‌ రింగు మోగుతున్నా
కట్‌చేస్తూ నన్ను నేను తిట్టుకోవాల్సిన బతుకు

హాయిగా నిద్దరోతూ
గుర్రుకొట్టాల్సిన సమయం
అలసి సొలసి ప్రశాంతంగా
సేద తీరాల్సిన సందర్భం.. అయినా

హెడ్డింగులు, ఫాంట్లు, కలర్లు,
పేజీపేజీకీ వార్తల కరెక్షన్‌
కీబోర్డూ, కంప్యూటర్‌ తెరతో గంటల తరబడి దోస్తీ
చివరికి నన్ను నేనే మరచిపోయే దౌర్భాగ్యం

ఇంటి కెళ్తే పెళ్లాం పక్కలో ఉన్నా
అసలు కామా పెట్టానా, ఫుల్‌స్టాప్‌ పెట్టానా
మొగోడని పెట్టానా, మొనగాడని పెట్టానా?
ఒకటే టెన్షన్‌.. పగోడికీ వద్దు ఈ జీవితం

తెల్లారి పేపర్‌ చూసే దాకా
కంటి మీద కునుకు కరువు
హమ్మయ్య…. అని ఊపిరి పీల్చుకున్నా
అంతటితో అయిపోయిందా?

సెంటర్‌స్ప్రెడ్‌కు ఏం చేయాలబ్బా
ఫస్ట్‌పేజీకి ఏం రాయిస్తే బాగుండు?
బుర్ర వేడెక్కి పనిచేయడమే మానేసిందాయె
ఇంకెక్కడి సృజనాత్మకత గురూ

ఒక్క ఉపద్రవం వస్తే బాగుండు
ఊరూరూ ధర్నాలతో దద్దరిల్లితే బాగుండు
కనీసం పెద్ద ప్రమాదమైనా జరిగితే ఈ రోజు గండం గట్టెక్కు
ఫొటోలతో సెంటర్‌స్ప్రెడ్‌.. హెడ్డింగులతో ఫస్ట్‌పేజ్‌

అన్నింటా ఆచితూచి
ప్రతీది బ్యాలెన్స్‌ చేసుకోవాల్సిన బతుకు
కర్ర విరగొద్దు
పాము చావొద్దు !

లేవగానే అనుకుంటా
గురువుగారు చెప్పినట్టు సింహంలా ఉండాలని
ఛఛ….దేనికీ దైర్యం చేయలేని జీవితం
చివరికి పిల్లికూడా నయం

మిగిలిందొక్కటే…. నెలజీతపు అల్ప సంతోషం
కట్టాల్సిన పద్దులన్నీ అతుకులు, గతుకులు
జీవితంలో పైకెళ్లిన గ్రాఫ్‌.. బీపీ, షుగరూ
అల్సరూ, మలబద్దకం, తలనొప్పి ఎలాగూఉండనే ఉన్నాయ్‌

అందరనుకున్నట్టే..
నిద్దరోయినా నిలబడే గుర్రాన్ని నేను
రోగమొచ్చినా
తుపాకీతో ముందుకురికే సైనికుడిని

చిన్నతప్పు జరిగిందో..
రేసుకు పనికిరాని అశ్వాన్ని షూట్‌ చేసినట్టు
చేయిని కోల్పోయిన యోధున్ని
సైన్యంలోంచి తొలగించినట్టు..

ఇక బతుకు చౌరస్తాయే..
బ్రైట్‌ ఫ్యూచరంటారా?
ఇప్పటి దాకా రాసిన అక్షరాలకే..
పైగా అందరి కళ్లూ పొడిచేలా ఉన్నాయ్‌…

(మఫిసిల్‌ డెస్కుల్లో నైట్‌డ్యూటీలు చేస్తున్న ఉపసంపాదకుల జీవితాలపై)

-చందనం శ్రీకాంత్‌
బొమ్మ: అక్బర్‌

అంతా తెలంగాన పుణ్యం

మా నేతల్ని సూద్దమన్నా దొరికెటోల్లు కాదు
వాల్లకు మేమసలుయాదికొచ్చెటోల్లమే కాదు
మా పని ఓటేసుడుమందమే
మేం గెలిపిచ్చినోల్ల ముంగట
నిన్నమొన్నటి దాక
ఎందుకూ పనికిరానోళ్లమే
ఆల్ల గలమల నిలుసునేతందుకు సుతం
అక్కరికి రానోల్లం

గిప్పుడు జూడు
అంతా తెలంగాన పుణ్యం
రాస్టం ఎప్పుడత్తదో గాని
మావోల్లంతా ఒక్కటైండ్రు
ఆల్ల గలమల నిలుసునెతందుకు బయపడుడు గాదు
ఆల్లను గలమలకెల్లి బయటకు గుంజుతుండ్రు
రాకుంటె మంచిగుండదని ఆల్లే వచ్చెటట్టు జేయవట్టిండ్రు

ఆయింత శేతుల్లకెల్లి జారిపోగిట్టనని
కదర్‌ కరాబుగాదిక్కనని
ఆల్లు మాతోని వచ్చి మాటగలపవట్టిండ్రు
కలిసే కష్టాలు తీర్చుకుందమని నచ్చజెప్పవట్టిండ్రు
ఉద్యోగాలొత్తయ్‌, నీల్లు గూడ వత్తయని
సల్లనిమాట జెప్పవట్టిండ్రు
అంతా తెలంగాన పుణ్యం

ఏమైతె అదైంది
ఇప్పటిదాక అన్యాయమైతె ఐంది గాక
మాకిప్పుడైతె మస్త్‌ కుష్‌
గంజి బట్టలేసుకుని కార్లల్ల తిరిగినోల్లంత
గిప్పుడు నడెండలో మా తొవ్వవట్టిండ్రు
మేమేడుంటె ఆడ సడక్‌మీదనె కూసుండవట్టిండ్రు
మా కోసం గంటె వట్టిండ్రు
బువ్వండి మాతో కుసోని తినవట్టిండ్రు
అంతా తెలంగాన పుణ్యం
ఊరూర్ల జరిగే లొల్లికి
మా పోరల్ని ముందుంచవట్టిండ్రు
ఎవలన్న సచ్చిపోతె
వచ్చి కన్నీల్లు కార్చవట్టిండ్రు
ఆల్లు వోతె నేను లేనా
అని ఓదార్చవట్టిండ్రు
జై తెలంగాన అనుకుంట
మా గొంతుల గొంతు కలుపవట్టిండ్రు

గిప్పుడిగ మడి ముట్టుడు లేదు
గా కులం గీకులమని అనుడు లేదు
చిన్నోల్లు, పెద్దోల్లని వేరు జేసుడు లేదు
బట్టలు నల్లగున్నయని దూరం బెట్టుడు లేదు
అందరం ఒక్కటైనం
మా నేతలంత శెయిల శెయిలు కలుపుతుండ్రు
అన్నదమ్ములమని అలుముకుంటుండ్రు
ఇగ ఇట్లనే ఉండాలె
ఎప్పటికీ కలిసే ఉండాలె
అంతా తెలంగాన పుణ్యం

– చందనం శ్రీకాంత్‌

  బొమ్మ: అక్బర్‌